రాజకీయాల్లోకి ప్రవేశించి రాణించాలని భావించే యువత కోసం ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డొమొక్రెటిక్ లీడర్ షిప్(ఐఐడీపీఎల్) ఓ ప్రత్యేక కోర్సును ప్రారంభించింది. పోస్టు గ్రాడ్యుయేషన్ ఇన్ పొలిటికల్ లీడర్ షిప్ పేరుతో నిర్వహించే ఈ కోర్సులో చేరడానికి ప్రవేశ రుసం కింద రూ. 2.5 లక్షలు చెల్లించాలి. తొమ్మిది నెలల కాలపరిమితి గల ఈ కోర్సు పూర్తిచేస్తే, ఉత్తమ నేతగా ఎదగే అవకాశం ఉందని ప్రచారం చేసింది. దేశంలోనే ఈ తరహా కోర్సులను అందించే కాలేజీల్లో ఇదే మొదటిదని ఆర్ఎస్ఎస్ తెలియజేసింది. ముంబయిలోని రాంభౌ మహల్గీ ప్రబోధినిలో మొదటి బ్యాచ్ తరగతులు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ కోర్సు కోసం ఎంబీఏ, ఐఐటీ పూర్తిచేసిన 14 రాష్ట్రాలకు చెందిన 450 మంది దరఖాస్తు చేసుకుంటే వారిలో 32 మందిని ఎంపిక చేశారు.
వీరిలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన యువకులు శిక్షణ తీసుకోనున్నారు. రాజకీయ నేపథ్యమున్న కుటుంబానికి చెందిన హైదరాబాద్ యువకుడు ప్రవీణ్ చంద్ర తన వారసత్వాన్ని కొనసాగించేందుకు అవసరమైన శిక్షణ కోసం ఇందులో చేరాడు. భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు వినయ్ సహస్రాబుద్ధే ఐఐడీపీఎల్కు ఛైర్మన్గా ఉన్నారు. నాయకత్వం, రాజకీయాలు, గవర్నెన్స్ విభాగాల్లో పీజీ కోర్సులను ప్రారంభించడం ఇండియాలో ఇదే తొలిసారని వినయ్ సహశ్రాబుద్ధే పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో నాయకత్వ లక్షణాలు కొరత తీవ్రంగా ఉంది. అలాగే దీని కోసం మంచి విద్యా సంస్థలు కూడా లేవని ఆయన అన్నారు. అంతేకాదు మనకు మంచి ఆలోచన కలిగిన నాయకుల కొరత చాలా ఉంది… దీని వల్ల సామాజిక-రాజకీయ రంగాల్లో మంచి నిర్వాహకులం కాలేకపోతున్నామని వినయ్ వ్యాఖ్యానించారు.